దుబ్బాక బరిలో నిలిచే అభ్యర్థి కోసం.. వేట కొనసాగించిన కాంగ్రెస్ పార్టీకి అనుకున్నట్లుగానే బలమైన అభ్యర్థి దొరికాడు. తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డినే బరిలోకి దించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న హస్తం పార్టీ.. అధిష్ఠానం ద్వారా అధికారికంగా ప్రకటించనుంది. దుబ్బాకలో పాగా వేయాలని యోచిస్తున్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్లుగానే వ్యూహరచనలతో ముందుకెళ్తోంది. చిన్న అవకాశాన్ని కూడా చేజారకుండా సద్వినియోగం చేసుకోవాలన్న కోణంలో.. నేతలంతా ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాలకు ఇంఛార్జిలను నియమించడంతో పాటు, మండలానికి నలుగురైదుగురు సీనియర్లను ఇంఛార్జిలుగా నియమించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది.
ప్రజావ్యతిరేఖ అంశాలను జనంలోకి
ఇప్పటికే పార్టీ తరఫున మండలాలకు ఇంఛార్జిలను నియమించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శులు ఇలా పార్టీకి చెందిన అందరిని దుబ్బాక నియోజక వర్గంలో పాగా వేయనున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రజావ్యతిరేఖ అంశాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ఇంఛార్జ్‌లు నేటి నుంచి ఆరు రోజులపాటు నియోజకవర్గం వదలి రాకూడదని స్పష్టం చేసింది. మండలాల వారీగా నియమించిన ఇంఛార్జిలను పరిశీలిస్తే.. ఎనిమిది మండలాలకు ప్రాధాన్యత క్రమంలో ముఖ్యనాయకులను బాధ్యతలు అప్పగించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. దుబ్బాక మండలానికి ఇంఛార్జిలుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు ఉన్నారు.
మిర్దొడ్డి ఇంఛార్జిలుగా రేవంత్, సీతక్క..
మిర్దొడ్డి మండలానికి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, శ్రీశైలం గౌడ్‌లను నియమించారు. తోగుట్ట మండలాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌లు చూసుకోనున్నారు. దౌలతాబాద్ మండల బాధ్యతను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లకు కట్టబెట్టారు.
భట్టికి చేగుంట బాధ్యతలు..
చేగుంట మండలానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, కేఎల్‌ఆర్‌లను నియమించారు. రాయిపోలె మండలానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత చంద్రశేఖర్, సంజీవ్ రెడ్డిలు, నర్సింగి మండలానికి పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్ షబ్బీర్ అలీ ఇంఛార్జ్‌లుగా ఉన్నారు. కైలాస్ శ్రీనివాస్‌లు, గజ్వేల్ మండలాన్ని మాజీ మంత్రి గీతారెడ్డి, నాయిని యాద్గిరికి అప్పగించింది.
ఇవీ చూడండి: దుబ్బాకలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు.. గెలుపెవరిదో?