సిద్దిపేట కేసీఆర్ నగర్ బ్లాక్ నం.111లోని రెండో అంతస్తులో ఇంటి నం.10లో కాముని నర్సింలు... భార్య సునీత, పిల్లలు ప్రణయశ్రీ, అభిరాం (ఏడేళ్లు)లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. నర్సింలు లారీ డ్రైవర్గా పనిచేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. ఆయన ఎదురుగా ఇంటి నం.11 ఉండే లత ఈ నెల 20న అవసరం కోసం వెయ్యి రూపాయలు చేబదులు అడగగా.. నర్సింలు ఇవ్వలేదు. తన తల్లి డబ్బులు అడిగితే ఇవ్వలేదని లత కుమారులు బాల్‌శెట్టి ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఆ కుటుంబంపై అక్కసు పెంచుకున్నారు.
సునీత ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో పడుకోగా అర్ధరాత్రి సమయంలో సదరు యువకులు ఇంటి తలుపులు బాది భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ దుర్భాషలాడారు. సునీత ఇంట్లో నుంచే నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. తలుపులు తన్నడం మొదలెట్టారు. దీంతో ఆందోళన చెందిన ఆమె తలుపు తీయగా.. ఇద్దరూ ఇంట్లోకి చొరబడి కుమారుడు అభిరాంను అదే అంతస్తుపై నుంచి కింద పడేశారు. బాలుడి తలకు తీవ్ర గాయాలవగా.. ఇరుగుపొరుగు సహకారంతో సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషమ పరిస్థితుల్లో బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బ్లాక్ ఇన్‌ఛార్జి బాబు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కింద ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
ఇవీ చూడండి:జేఈఈ-మెయిన్స్ పరీక్షలు వాయిదా!