మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాకలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు మంజీరా నదికి వెళ్లిన యువకుడు ఆ నీటిలో మునిగి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంగిలి నవీన్(20), తన స్నేహితులు ఏడుగురు కలిసి ఈత కొట్టేందుకు సమీపంలోని పుట్టిరేవు గడ్డకు వెళ్లారు. ఈత కొడుతుండగా నవీన్ నీటిలో మునిగిపోయాడు. గ్రహించిన మిత్రులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఒంటిపై గాయాలు..
నవీన్ ఇంటికి రాకపోవడంతో తల్లి ప్రమీల చుట్టుపక్కల వెతికింది. బుధవారం ఉదయం నది సమీపంలో గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై గాయం చేసిన గుర్తులు ఉండటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ మృతదేహాన్ని చూసి అతని తల్లి రోధించడం స్థానికులను కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈతకు వెళ్లిన మిగిలిన వారిపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం వల్ల అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సైదాబాద్‌లో యువకుడి అనుమానాస్పద మృతి