Ganjayi Smuggling : కార్లలో, ద్విచక్రవాహనాలపై పయనించే మహిళలు నిబంధనలు పాటించకున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారు. వారిపట్ల ఉన్న సానుభూతిని నేరస్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో తరచూ పట్టుబడుతున్న నిందితుల్లో ఎలాంటి నేరచరిత్ర లేని మహిళల భాగస్వామ్యం ఉండటం వెనుక లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇదంతా నేరస్థుల ఎత్తుగడగా గుర్తించారు.
Ganjayi Smuggling in Telangana : కుటుంబ బాధ్యతలు.. పిల్లల చదువులు.. కూలి చేసుకుంటూ ఇంటిని పోషించే మహిళల పేదరికాన్ని నేరస్థులు అవకాశంగా మలచుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన స్మగ్లర్లు గంజాయి తరలింపులో మహిళలు, యువతులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. 15-20 రోజులు పనిచేస్తే చేతికందే సొమ్మును 2-3 రోజులు సహకరిస్తే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు.
Cannabis Smuggling : ఒక్కో గ్రూపులో 2-4 వరకూ మహిళలు, యువతులు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రైవేటు వాహనాల్లో వీరిని అరకు, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాలకు చేర్చుతారు. అక్కడి ఏజెంట్లకు వీరి ఫోన్‌నంబర్లు అందజేస్తారు. మహిళలు ఆయా ప్రాంతాలకు చేరాక గంజాయి పొట్లాలను చేతిసంచుల్లోకి సర్దుతారు. తనిఖీలో పట్టుబడకుండా నిత్యావసర వస్తువులు, చీరలు, చిన్నపిల్లల దుస్తులను ఉంచుతారు. ఆర్టీసీ బస్సులు, రైలు మార్గాల్లో సికింద్రాబాద్ చేరతారు. ప్రయాణమధ్యలో పోలీసులు తనిఖీలు ఉన్నట్లు గుర్తిస్తే ఆ సంచులకు దూరంగా వెళ్లిపోతారు. సరకు సికింద్రాబాద్ చేరకముందే మౌలాలి వద్ద ఏజెంట్లు స్వాధీనం చేసుకుంటారు.
Cannabis Smuggling in Telangana : సురక్షితంగా చేర్చిన ఒక్కో మహిళకు రోజుకు రూ.4,000-5,000 వరకూ ఇస్తారు. ఖరీదైన కార్లలో మాదకద్రవ్యాలు తరలించేందుకు 20-22 ఏళ్ల యువతులను నియమించుకుంటున్నారు. ఇటీవల నాలుగు ముఠాలు ఇదే తరహాలో సుమారు 1000 కిలోల సరకును జహీరాబాద్ చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతర్రాష్ట్ర ముఠాల వాహనాల్లో ఏపీ, ఏవోబీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకూ ఎస్కార్టుగా ఉన్న ఒక్కో యువతికి రూ.20,000-25,000 వరకూ ఇస్తున్నారని ఓ పోలీసు అధికారి వివరించారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన మేడ్చల్‌కు చెందిన ఓ మహిళ.. ముగ్గురు పిల్లలను పోషించేందుకు కూలి డబ్బులు చాలక గంజాయి పొట్లాలు చేరవేసేందుకు ఒప్పుకున్నానని కన్నీరు పెట్టుకుందంటూ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు తెలిపారు.
- ఇదీ చదవండి : మహిళలకు కమీషన్ ఆశజూపి గంజాయి తరలింపు.. ముఠా అరెస్ట్