విద్యుత్‌శాఖలో పారిశుద్ధ్య కార్మికురాలైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కన్న కొడుకే తల్లి మరణానికి కారణమై ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం..
ఓల్డ్ బోయిన్‌పల్లి ఫ్రెండ్స్ కాలనీకి చెందిన బాలమణి.. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వర్తించేది. ఈ నెల 17వ తేదీన రాత్రి బాలమణి కుమారుడు శంకర్.. తన సోదరి చంద్రకళకు ఫోన్ చేసి, తమ తల్లి ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి గాయలపాలైందని తెలిపాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మృతిచెందినట్లు వివరించాడు.
ఆ మేరకు మృతురాలి కూతురితో పాటు బంధువులు ఆవిడ ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు సన్నద్ధమయ్యారు. ఆ క్రమంలో స్థానికులు మృతురాలి ఒంటిపై గాయాలను గుర్తించారు. ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మేరకు.. మృతురాలి కుమారుడు చేసిన అప్పుల విషయంలో తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు గుర్తించారు. శంకర్ తన తల్లిని తోసేయడం వల్లే ఆమె కిందపడి మృతిచెంది ఉంటుందని వారు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఇదీ చదవండి: ఆత్మహత్యాయత్నం... యువకుడు మృతి, యువతి పరిస్థితి విషమం