కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అసువులు బాసారు. వైరస్ నుంచి ఎంతో మంది కోలుకున్నారు. కానీ కోలుకున్న తర్వాత వారిని కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. వైపు బ్లాక్, వైట్, గ్రీన్, ఎల్లో, క్రీమ్ ఫంగస్ అంటూ పుట్టుకొస్తున్న రోగాలతో.. కొవిడ్ నుంచి కోలుకున్న వారు బలైపోతున్నారు. కరోనా నుంచి తప్పించుకున్నామని ఆనందపడేలోగానే.. ఫంగస్ల రూపంలో మృత్యువు ముంచుకొస్తోంది. ఇవే కాకుండా.. కొవిడ్ నుంచి కోలుకున్న వారు రకరకాల సమస్యలతో సతమవతమవుతున్నారు. కొందరు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి సంఘటనే ఏపీలోని విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది.
విశాఖ జిల్లా పాడేరులో పళ్ల ప్రసాద్ అనే ఉపాధ్యాయడు, అతని భార్య పద్మలక్ష్మి (36), ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తున్నారు. పద్మలక్ష్మికి ఇటీవల కరోనా సోకింది. చికిత్స అనంతరం నెగిటివ్ రాగా.. ఇటీవల.. ఒళ్లంత తీవ్రంగా మంట ఉంటోందని కుటుంబసభ్యులకు తెలిపింది. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతానంటూ ఎన్నో సార్లు ఏడ్చింది. తమ తల్లి బాధను చూడలేక ఆ పిల్లలు తల్లడిల్లిపోయేవారు. ఏం చేస్తే అమ్మ ఆరోగ్యం కుదుటపడుతుందో అర్థంగాక విలవిలలాడిపోయేవారు.
ఎప్పుడు తల్లివెంటే ఉంటూ ధైర్యం చెప్పేవారు. రోజులాగే బుధవారం రాత్రి తల్లికి ధైర్యం చెబుతూ.. ఎలాగోలా నిద్రపుచ్చారు. ఆమె పడుకున్న తర్వాత తండ్రి ప్రసాద్‌తో కలిసి వారు కూడా నిద్రపోయారు. ప్రసాద్ తెల్లారి లేచి చూస్తే భార్య ఇంట్లో కనపడకపోయేసరకి తన పిల్లలతో ఆసుపత్రిలో, తన పొలంలో వెతికారు. బాధ తట్టుకోలేక తాను చనిపోతానన్న మాటలు గుర్తొచ్చి వారి గుండెల్లో గుబులు పుట్టింది. ఊరంతా వెతికినా ఎక్కడ కనిపించకపోయేసరికి వారి మనసులో ఏదో కీడు శంఖించింది. చివరకు అదే నిజమైంది.
కొత్త పాడేరు వెళ్లేదారిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద పద్మలక్ష్మి విగతజీవిగా పడి ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని..అనారోగ్యం వల్లనే మరణిస్తున్నాని రాసిన సూసైడ్ నోట్ ఆమె మృతదేహం వద్ద లభించింది.
నా భార్యకు కరోనా వచ్చింది. ట్రీట్మెంట్ చేయించాం. ఆ తర్వాత తనకు బాగానే ఉంది. అయితే.. ఇటీవల ఒళ్లంతా మంటగా ఉందని.. బాగా దాహం వేస్తోందని అనేది. వాళ్ల బంధువులకు కూడా ఫోన్ చేసింది. తాను త్వరలోనే చనిపోతామేనని, బతకనేమో అని వారికి చెప్పింది. రాత్రి నిద్రపోయిందనే అనుకున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు మా పాప లేచింది. అమ్మ కనిపించకపోయేసరికి ఏది.. అని అడిగింది. పాప, నేను హస్పిటల్‌కు వెళ్లి చూశాం. అక్కడ కనిపించలేదు. పొలం వైపు వెళ్లి చూశాం.. అక్కడ కూడా లేదు. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడిపోయి ఉంది. ఆత్మహత్య చేసుకుంది.
-మృతురాలి భర్త
మరోవైపు.. మృతురాలి కుమార్తె కూడా.. ఘటనపై కన్నీటి పర్యంతమైంది. తన తల్లి చనిపోయిన తీరును తలుచుకుంటూ గుక్కపెట్టి ఏడ్చింది. తల్లి కోసం ఆ పిల్లలు ఏడుస్తున్న తీరును చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.