Woman dead : ఏపీలోని గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. చిలకలూరిపేట నుంచి చెత్తకాగితాలు ఏరుకోవడానికి ఓ మహిళ తన పిల్లలతో కలిసి లారీలో గుంటూరుకు వచ్చింది. ఛార్జీ డబ్బులు తక్కువగా ఇచ్చిందని మహిళపై ఆగ్రహించిన ఓ లారీ డ్రైవర్.. ఆ మహిళను లారీతో ఈడ్చుకెళ్లాడు. అదుపుతప్పి వాహనం కింద పడిన మహిళ.. అక్కడికక్కడే మృతి చెందింది.
రమణ(40) అనే మహిళ.. చెత్త కాగితాలు ఏరుకోవడానికి తన పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చింది. గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి వంద రూపాయలు ఛార్జీ ఇచ్చింది. రూ.300 ఇవ్వాలని లారీ డ్రైవర్ మహిళను డిమాండ్ చేశాడు. ఆగ్రహంతో పిల్లలను దించకముందే లారీని ముందుకు నడిపాడు. పిల్లల కోసం లారీని పట్టుకుని వేళాడుతూ మహిళ కొంత దూరం అలానే వెళ్లిన రమణ.. అదుపుతప్పి లారీ కింద పడి మృతిచెందింది. తల్లి మృతదేహంపై పడి పిల్లలు రోదిస్తున్న తీరు.. స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.