wives postponed husband's funeral : మానవ బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని పెద్దలు చెప్పిన మాటే నిజమవుతోంది. నిన్న మొన్నటి దాక ఆస్తి కోసం తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెళ్లెల్ల మధ్య గొడవలు జరగడం.. హత్యలు చేసుకోవడం చూశాం. కన్నవాళ్లు కన్ను మూస్తే వాకిట్లో శవాన్ని ఉంచి ఆస్తి పంపకాల గురించి గొడవ పడటం గురించి విన్నాం. కానీ కట్టుకున్న భర్త కన్ను మూస్తే అంత్యక్రియలు జరిపించాల్సిన భార్యలు ఆస్తి పంపకాల కోసం దహనసంస్కారాలను అడ్డుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటుచేసుకుంది.
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు కొంత కాలం నుంచి కోరుట్లోల నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. ఇటీవలే నర్సింలు అనారోగ్యంతో మృతి చెందాడు. సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. ఆస్తిలో వాటా కోసం ఇద్దరు భార్యలు అతడి మృతదేహం ముందే గొడవకు దిగారు.
అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి ఆస్తి పంపకాల కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. తమ పేర్ల మీద ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న మరునాడు నర్సింహులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు విస్తుపోయారు. శవాన్ని వాకిట్లో పెట్టి ఆస్తి కోసం పంచాయితీ ఏంటని విస్మయం చెందారు.