అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి విలవిల్లాడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. అటవీశాఖ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కుభీరు మండలంలోని పాతసాంవ్లీ- లింగి వ్యవసాయ శివారులో మహారాష్ట్రలోని నంద గ్రామానికి చెందిన.. చౌహాన్ సురేశ్, నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్‌తరోడా గ్రామానికి చెందిన తుల్సిరాం అడవి జంతువులను హతమార్చేందుకు ఆదివారం వేకువజామున వల వేశారు. అందులో కృష్ణజింక, కొండ గొర్రె, ఓ మయూరం చిక్కుకున్నాయి. నెమలి అక్కడికక్కడే మృతిచెందింది. సాంవ్లీ వాసులు నిందితులను పట్టుకుని కుభీరు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వేటగాళ్లను అదుపులోకి తీసుకుని జింక, గొర్రెను అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కొండ గొర్రె పరిస్థితి విషమంగా ఉండటంతో పశువైద్యాధికారి వద్ద చికిత్సలు చేయించారు. నిందితులను భైంసా న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు అటవీశాఖ అధికారి ఇర్ఫాన్ తెలిపారు.
ఇదీ చూడండి : ఈతకు వెళ్లి గొర్రెల కాపరి మృతి