Wife kills husband in Kamareddy : భర్త పెట్టే వేధింపులు భరించలేని ఓ భార్య... కట్టుకున్నవాడిని తుదముట్టించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని... దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగింది?
Kamareddy murder case : కామారెడ్డి పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన ఆఫ్రోజ్(38) పట్టణంలో అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య ఫర్జానా, పదేళ్ల కొడుకు ఉన్నారు. రోజు మద్యం సేవించి ఫర్జానాను మానసికంగా వేధించేవాడు. ఆ బాధలు భరించలేని ఫర్జానా... సోమవారం రాత్రి ఆఫ్రోజ్ నిద్రపోయిన తర్వాత చున్నీతో మెడను బిగించి హత్య చేసింది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన ఆఫ్రోజ్... మృతి చెందాడు.
వేరే హస్తం ఉందా?
ఆఫ్రోజ్ గొంతుకు గాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఫర్జానాకు ఆఫ్రోజ్ రెండో భర్త అని.. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆఫ్రోజ్ను పెళ్లి చేసుకుందని పోలీసులు తెలిపారు. మొదటి భర్తతో కలిగిన సంతానం... 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడని వెల్లడించారు. ఆ బాలుడు తల్లితోనే ఉంటున్నాడు. ఆఫ్రోజ్ను ఫర్జానానే హత్య చేసిందా? లేదా ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్రోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి డీఎస్పీ సోమనాథం... ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిందితురాలు ఫర్జానాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: father murdered two children: ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన తండ్రి