WIFE KILLED HUSBAND IN VIZAG: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఓ ఇల్లాలు.. అతడు అదృశ్యమయ్యాడంటూ అందరినీ నమ్మించబోయి చివరకు దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో సంచలనం రేపింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఎంవీపీ కాలనీ సమీప వాసవానిపాలేనికి చెందిన జ్యోతికి, భీమిలి మండలం వలందపేటకు చెందిన వంకా పైడిరాజు (28)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి బాలాజీ (5), హర్షిత(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పైడిరాజు టైల్స్ పనులు చేస్తుంటాడు. జ్యోతికి (25) పెళ్లికి ముందే.. వాసవానిపాలెంలో పొరుగింట్లో ఉండే వాడమొదులు నూకరాజు (25)తో సన్నిహితంగా ఉండేది. ఇటీవల అతడు మళ్లీ ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. అత్తవారిది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇక్కడ కలుసుకోవడం కుదరదని వారిద్దరూ విశాలాక్షినగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నారు. నగరంలోని సీబీఐ కార్యాలయంలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నానంటూ ఇంట్లోవాళ్లను నమ్మించి ఆరు నెలలుగా ప్రతిరోజూ ప్రియుడి గదికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేది. ప్రియుడిపై మోజు ఎక్కువ కావడంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని జ్యోతి పథకం వేసింది.
అన్నంలో నిద్ర మాత్రలు కలిపి..: గత నెల 29వ తేదీ రాత్రి పైడిరాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. రాత్రి ఒంటిగంట సమయంలో ప్రియుడు నూకరాజుకు ఫోన్ చేసింది. అతడు తనకు సోదరుడి వరసయ్యే కె.భూలోకతో కలిసి వచ్చాడు. ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న పైడిరాజు మెడకు తీగ బిగించి హతమార్చారు. మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై మధ్యలో పెట్టుకుని విశాలాక్షినగర్‌లోని గదికి తరలించారు.
అంబులెన్సుకు కాల్ చేసి..: తెల్లవారుజామున నూకరాజు అంబులెన్స్‌కు కాల్ చేసి తన స్నేహితునికి ఒంట్లో బాగోలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. సిబ్బంది వచ్చి చూసి పైడిరాజు చనిపోయాడని చెప్పడంతో తనకు ఎవరూ లేరని నమ్మించి అదే వాహనంలో మృతదేహాన్ని పెద జాలారిపేట సమీప వాసవానిపాలెం శ్మశానవాటికకు తరలించి గుట్టుగా దహనం చేసి, బూడిదను సముద్రంలో కలిపేసి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు (గత నెల 30వ తేదీన) జ్యోతి తన భర్త కనిపించడంలేదంటూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మృతుడి సోదరులు జ్యోతి ప్రవర్తనపై అనుమానం వ్యక్తంచేయడం.. ఆమె సీబీఐ కార్యాలయంలో పనిచేయడం లేదని తేలడంతో పోలీసులకు ఆమెపై అనుమానం బలపడింది. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారించగా నూకరాజుతో ప్రేమాయణం బయటపడింది. నిందితులిద్దరినీ విచారించగా పైడిరాజును హత్య చేసినట్లు అంగీకరించారు. జ్యోతి ఘాతుకం గురించి తెలుసుకున్న వలందపేట గ్రామస్థులు గురువారం ఉదయం భారీ సంఖ్యలో భీమిలి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: మాంత్రికుడి కోసం గూగుల్‌లో వెతికితే లక్షలు దోచేశారు
కరెన్సీ నోట్ల భద్రత పోగు సరఫరాలో అవినీతి!.. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిపై CBI కేసు