ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను చేరువ చేయాల్సిన గ్రామ సచివాలయంలోనే దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో ఓ బాలికపై లైంగిక దాడి(Sexual Assault on Girl) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఏపీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అక్టోబరు 31న వాలంటీరు బొత్స హరిప్రసాద్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న గుగ్గిలాపు రాంబాబు ఆ వాలంటీరుకు సహకరించాడు. బాలికను లోపలకు తీసుకువెళ్లిన తరువాత బయట తలుపులు మూసివేసి తాళం వేసి కాపలా ఉన్నాడు. ఆ తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలిక కాసేపటికి తేరుకొని ఇంటికి వెళ్లిపోయింది. ఈ విషయమై బాలిక సోదరికి అనుమానం వచ్చింది.
తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడం వల్ల ఆలస్యమైంది. వారు వచ్చిన తరువాత జరిగిందంతా చెప్పింది. వారు ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4న దిశ డీఎస్పీ వాసుదేవ్, దిశ బృందం గ్రామంలో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితులిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం చర్యలు చేపడతామని ఎస్‌ఐ భాస్కరరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆడవారిపై ఆ కళ్లు.. కంటికి కనిపించని శత్రువులు