ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ పదోరోజూ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ముగ్గురు అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా నాయకులు లక్ష్మీ రంగా, వెంకటరమణను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ వీరిని విచారించినట్లు సమాచారం. వివేకాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన జగదీశ్వర్ రెడ్డినీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతను గతంలో వివేకా దగ్గర పనిచేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకూ విచారణ ఇలా..
వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరుసగా 5 రోజుల పాటు ప్రశ్నించిన సీబీఐ.. కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వివేకా ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లోకి దస్తగిరిని తీసుకెళ్లి పరిశీలించారు. హత్య జరిగిన రోజు నిందితులు అక్కడేమైనా నక్కి ఉన్నారా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం.
పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను విచారణ చేశారు. కిరణ్ సోదరుడు సునీల్ కుమార్ యాదవ్‌తోపాటు కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించారు. ఇక సీబీఐ అధికారుల అడిగిన మేరకు.. రవాణా శాఖ సిబ్బంది కొన్ని వాహనాల వివరాలు అందజేశారు. ఆ తర్వాత పులివెందుల వెళ్లిన సీబీఐ బృందం.. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా ఇన్నోవా వాహనం తిప్పిన యజమాని మట్కా రవితో పాటు డ్రైవర్ గోవర్దన్‌ను ప్రశ్నించింది.
ఆదివారమూ సీబీఐ అధికారులు విచారణ జరిపారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ వెంకటేశ్‌ను ప్రశ్నించారు. ఓ మహిళనూ పలు అంశాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పులివెందుల వెళ్లి వివేకానందరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో అధికారులు మాట్లాడారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన దర్యాప్తు బృందం.. విచారణ మొత్తాన్నీ గోప్యంగా ఉంచారు. ఇప్పుడు చిట్వేలి మండలానికి చెందిన వైకాపా నాయకులు లక్ష్మీకర్, రమణను ప్రశ్నిస్తున్నారు.
ఇదీచూడండి: Delta Variant: డెల్టా వైరస్ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు!