జగిత్యాల గ్రామీణ మండలం బావాజీపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించినందుకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కక్షతో.. ఆ కుటుంబంపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేసి. వారిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డరు. ఈ ఘటనలో పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది..
బావాజీపల్లెకు చెందిన గంగనీలయ్యకు, మరొకరికి భూమి విషయంలో వివాదం తలెత్తింది. గొడవ పరిష్కరించేందుకు వారం రోజుల కింద ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచయతీ ఏర్పాటు చేశారు. అయితే వారు చెప్పిన పరిష్కారం నచ్చకపోవడంతో నీలయ్య వారి మాటను ఒప్పుకోలేదు. పెద్ద మనుషులు ఇచ్చిన తీర్పు వినకపోవడంతో.. కోపగించిన కుల పెద్దలు నీలయ్య కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు.
పోలీసు కేసు పెట్టడంతో కక్ష పెంచుకుని..
కుల బహిష్కరణపై నీలయ్య జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. గ్రామ పెద్దలైన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నీలయ్య కేసుపెట్టడంతో కక్ష పెంచుకున్న గ్రామస్థులు.. అతడి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ ఎస్‌ఐ చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గ్రామస్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాధ్యులైన 15 మందిపై కేసు నమోదు చేశారు. గ్రామంలో మళ్లీ గొడవ జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: నవ దంపతుల ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా!