హైదరాబాద్ లో లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపై వచ్చిన ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలపై పోలీసులు జరిమానా విధించారు. సీజ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టుల ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ సమయం పూర్తయిన తర్వాత భారీ పోలీసు పహారా మధ్య, మధ్య మండలం అదనపు డీసీపీ రమణ రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ చెకింగ్ పాయింట్ల వద్ద పెద్ద ఎత్తున తనిఖీ చేపట్టారు.
300 వాహనాలు సీజ్
ఎలాంటి అనుమతులు లేకుండా అనవసరంగా రోడ్లపై సంచరించే దాదాపు 300కు పైగా ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు సీజ్ చేసినట్లు చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ తెలిపారు. చిక్కడపల్లి డివిజన్ లోని మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి రోడ్లపై వచ్చిన వ్యక్తులపై దాదాపు 400కు పైగా కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు.
ప్రజలు అత్యవసర సమయాల్లోనే బయటికి రావాలని, లేనిపక్షంలో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. రోడ్లపై కూర్చుని తమకు వాహనాలు ఇవ్వాలని కొందరు ప్రాధేయపడడం కనిపించింది.
ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న అంబులెన్సులు...
లాక్ డౌన్ నియమాలు ప్రకారం విధించిన సమయం ముగియడంతో ఒక్కసారిగా జనం ఇళ్లకు వెల్లాలని రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. అందులో చిక్కుకున్న 2 అంబులెన్సులు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇదీ చూడండి: దొంగ నంబరు ప్లేట్లతో దర్జా.. వాహన యజమానులకు ఇబ్బందులు