గంజాయి ద్రావణాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు లీటర్ల గంజాయి ద్రావణం, రెండు చరవాణిలతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఏపీలోని పశ్చిమగోదావరికి చెందిన సంతోశ్‌కుమార్ బతుకు దెరువు కోసం.. హైదరాబాద్ వచ్చి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కామారెడ్డికి చెందిన వీరభద్ర అతని వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఆ వ్యాపారం ద్వారా వస్తున్న డబ్బులు సరిపోలేదు.
విశాఖపట్నంకు చెందిన రాజుతో వారు పరిచయం పెంచుకుని గంజాయి దందా మొదలుపెట్టారు. విశాఖ నుంచి ఆటోలో గంజాయి ద్రావణం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించడం మొదలు పెట్టారు. వారు విశాఖపట్నం నుంచి ఆటోలో కూరగాయలతో పాటు మూడు లీటర్ల గంజాయి ద్రావణాన్ని తీసుకొస్తుండగా... సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ బాహ్యవలయ రహదారి వద్ద తనిఖీలు చేపట్టి సంతోశ్ కుమార్, వీరభద్రను అరెస్ట్ చేశారు. విశాఖపట్నంకు చెందిన రాజు పరారీలో ఉన్నట్లు ఎస్ఓటీ పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి : అక్రమ రసాయనాల గోదాం సీజ్..