Wife and Husband Brutally Murdered: పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలపై అర్ధరాత్రి.. కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. రక్తపు మడుగులో దంపతుల మృతదేహాలు.. గ్రామస్థులకు ఆందోళన కలిగించాయి. ఘటనకు గల కారణాలేమిటో పోలీసులకు ఇంతవరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు.
కొత్త సాంబయ్య(60), లక్ష్మీ(55) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఉన్నంతలో ముగ్గురి పెళ్లిళ్లూ ఏ లోటు లేకుండా చేశారు. పెళ్లయ్యాక కుమారుడు గ్రామంలోనే మరో ఇంట్లో వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రికి మందుల కోసం సాంబయ్య కుమారుడు.. మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు. వేసవికాలం కావడంతో సాంబయ్య.. మంగళవారం రాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్నారు. లక్ష్మీ ఒక్కతే ఇంట్లో నిద్రపోతోంది. అర్ధరాత్రి దాటాక.. కొందరు గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దంపతులిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరినీ ముఖంపై తీవ్రంగా దాడి చేయడంతో.. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ఉదయం యథావిధిగా నిద్రలేచిన ఇరుగుపొరుగు వాళ్లకు.. పక్కింట్లో సాంబయ్య, లక్ష్మీ మృతదేహాలు రక్తపు మడుగులో భీకరంగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.
ఇవీ చదవండి: పోలీసు ఆడిన దొంగాట.. చివరకు ఉద్యోగం ఊడెనంట
రండిబాబూ రండి అన్నాడు.. వచ్చి బుట్టలో పడ్డాక అన్నీ అమ్ముకుని పరారయ్యాడు..