WIFE AND HUSBAND DIED IN HYDERABAD: వారిద్దరు ప్రేమించుకున్నారు అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినప్పటికీ వివాహం చేసుకుని.. నగరానికి వచ్చి ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య గర్భం దాల్చింది. ఇంతలో వారి దాంపత్య జీవితాన్ని విధి చిన్నచూపు చూసింది. రెండురోజుల క్రితం భార్యకు పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయించాడు. ఆమె పండంటి పాపకు జన్మనించి తనువు చాలించింది. దీంతో భార్య ఎడబాటును జీర్ణించుకోలేక ఆమె మృతదేహం మార్చురీలో ఉండగానే ఆ అమర ప్రేమికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పాప వెంటిలెటర్‌పై ఉండగా.. భార్యాభర్తల మృతదేహాల మార్చురీలో ఉన్నాయి. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మౌలాలీ ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నారాయణపేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ ఇంటిపక్కనే ఉండే భీమేశ్వరి అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయాన్ని ఇరువురి తల్లిదండ్రులకు తెలియజేయగా దానికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఎదిరించి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నగరానికి వచ్చి మౌలాలి ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటోను నడుపుతూ భార్యతో కలిసి అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే పక్కింటి మహిళను సాయంగా తీసుకుని నేరేడుమెట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
అక్కడే పాపకు జన్మనించింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు కూతురును కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాపను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి మృతిచెందింది. ఒకవైపు పాప వెంటిలెటర్‌పై, మరోవైపు కట్టుకున్న భార్య చనిపోవడంతో ఆమె ఎడబాటును జీర్ణించుకోలేని నవీన్ కుమార్ మనస్తాపానికి గురై జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఆర్పీఎఫ్ హోంగార్డు గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి జేబులో లభ్యమైన మొబైల్‌ఫోన్ ఆధారంగా మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం భార్యాభర్తల మృతదేహాలు గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయి.
ఇవీ చదవండి: