తనతో ఏడడుగులు వేసిన భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్లలో శుక్రవారం రాత్రి జరిగింది. సీరోలు ఎస్సై నరేశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లెల్ల గ్రామానికి చెందిన కొమిరె జంపయ్య(36) భార్య నాగేంద్రకు అదే గ్రామానికి చెందిన తోట నరేశ్‌తో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఇదే విషయమై పలుమార్లు జంపయ్య, నరేశ్ మధ్య ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ నరేశ్ తన తీరు మార్చుకోకపోవడంతో.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి జరిమానా విధించారు. అప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. దాంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే విషయంపై నాలుగు రోజుల కిందట భర్తతో గొడవ పడిన భార్య తన తల్లిగారి ఊరైన రాజోలుకు వెళ్లింది. శుక్రవారం నరేశ్.. జంపయ్యను తీసుకొని మహబూబాబాద్‌కు వెళ్లాడు. అక్కడ మాటల సందర్భంలో ‘నిన్ను, నీ పిల్లల్ని నీ భార్య చంపేస్తుంది’ అంటూ బెదిరించాడు.
దీంతో భయపడిన జంపయ్య రాత్రి వరంగల్‌లో ఉంటున్న తన సోదరుడు ఎల్లయ్యకు ఫోన్ చేసి ‘నా భార్య నన్ను, పిల్లల్ని కొట్టి చంపే ప్రయత్నం చేస్తుంది’ అంటూ నరేశ్ చెబుతున్నాడని... తనకు బతకడం ఇబ్బందిగా ఉందని.. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన ఎల్లయ్య ఆ గ్రామంలోని తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పడంతో వారు అక్కడి వెళ్లి చూసేసరికే అప్పటికే ఉరి వేసుకుని కనిపించాడు. జంపయ్య మృతికి నరేశ్ కారణమంటూ మృతదేహాన్ని అతని ఇంటి ముందు వేసి ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న సీరోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి చిన్న వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని భార్య నాగేంద్ర, నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మృతుడికి ఎనిమిదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు.
ఇవీ చూడండి: