Two Workers died while cleaning septic tank at Gachibowli : రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు దిగగా... కాసేపటి తర్వాత వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కూలీల మృతితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
ఏం జరిగింది?
గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా ఇద్దరు వారికి ఏం జరిగిందోనని లోపలికి దిగి చూడగా ఆ ఇద్దరు విగత జీవులుగా కనిపించారు.
ఉద్రిక్తత
మృతి చెందిన కూలీలు ప్రైవేట్ సంస్థ అయిన "డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్" తరఫు నుంచి వచ్చిన సిబ్బంది అంజి (30), శ్రీను(32)గా గుర్తించారు. మృతులు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. మాదాపూర్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి... మృతదేహాలను వెలికి తీశారు. బయటకు తీసిన మృతదేహాలను తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా... చనిపోయిన వారి కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మృతుల కుటుంబసభ్యులు అపార్టుమెంట్ ముందు బైఠాయించారు. న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఘాజీనగర్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉదయం మాకు హేమదుర్గ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్ నుంచి సమచారం వచ్చింది. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఇద్దరు వ్యక్తులు బయటకు రాలేదని ఫోన్ చేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాం. ఆక్సిజన్ ట్యాంక్ సహాయంతో లోపలికి దిగి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్రీను, అంజయ్యగా గుర్తించాం. వీరు సింగరేణి కాలనీకి చెందినవారిగా తెలుస్తోంది. మరో ఇద్దరు స్వామి, జాన్‌లు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో కొండపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించాం. ఈ ఘటన పై కేసు నమోదు చేశాం. ఓనర్ స్వామిపై కేసు నమోదు చేస్తాం.
-సురేశ్, గచ్చిబౌలి సీఐ
డ్రైనేజీలో పడి మనుషులు ఇరుక్కుపోయారని కాల్ వచ్చింది. రెస్క్యూ కోసం వెహికిల్ సిబ్బంది వచ్చారు. డ్రైనేజీ ఓవర్ ఫ్లో అవుతోందని అపార్టుమెంట్ వాళ్లు ఆన్లైన్లో సెర్చ్ చేసి డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్‌ను పిలిచారు. వాళ్లు వచ్చి పైపుల ద్వారా కొంత వాటర్ తీసేశారు. డ్రైనేజీలు క్లోజ్‌గా ఉండడం, రకరకాల వ్యర్థ పదార్థాలు రియాక్షన్ జరగడం వల్ల విష వాయువులు వెలువడుతాయి. వాటిని కొంచెం పీల్చినా.. అపస్మారక స్థితిలోకి వెళ్లి.. చనిపోతారు. వీళ్లకు తెలిసిఉండాలి. మినిమమ్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి. వీళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా... తొందరపాటుగా దిగినట్లుగా తెలుస్తోంది. అపార్టుమెంట్ వాళ్లు కూడా హెచ్చరించాలి. మొత్తం నలుగురు దిగగా... ఇద్దరు మృతి చెందారు. ఇద్దరూ ఆస్పత్రిలో ఉన్నారు. మా సిబ్బంది జాగ్రత్తలతో దిగి.. మృతదేహాలను వెలికితీశారు. ఇంత అవగాహన ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టం. జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటివి జరగవు.
-గిరిధర్ రెడ్డి, అగ్నిమాపక అధికారి
ఇదీ చదవండి: Farmer Died due to Crop Loss : 15 ఎకరాల పంట నీటిపాలు.. తట్టుకోలేక ఆగిన కౌలురైతు గుండె!