ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని విలపిస్తూ ఇద్దరు మహిళలు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ డబ్బా తీసుకుని కలెక్టర్ కార్యాలయం భవనం పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హనుమకొండలోని పాల సముద్రం ప్రాంతానికి చెందిన అత్తాకోడలు తిరుపతమ్మ, కావేరి.. తమ భూమిని ఇతరులు కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుతం ఇచ్చిన భూమిలో తాము ఇల్లు కట్టుకొని ఉంటే శ్రీను, విజయేందర్ అనే వ్యక్తులు వచ్చి ఇంటిని కూలగొట్టి తమపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించినా కూడా వారు స్పందించలేదని వాపోయారు.
అందుకే కలెక్టరేట్‌కు చేరుకుని భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం బాధితులు.. కలెక్టర్ రాజీవ్ గాంధీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు అక్కడే ఉంటామని చెప్పారు.
ఇదీ చదవండి: Gazette for Jurisdiction of KRMB & GRMB : 'సమస్యలున్నాయ్.. గెజిట్ అమలు వాయిదా వేయాలి'