విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో చోటుచేసుకుంది. స్థానిక కౌలురైతు మల్లేశం తన పొలంలో కలుపు తీయడానికి నవనీత, లక్ష్మీ, జ్యోతి, లత, వసంతలను వెంట తీసుకువెళ్లారు. సర్వీసు తీగకు నవనీత(38) కాళ్లకు విద్యుత్ తీగలు తాకగా కరెంట్ షాక్కు గురైంది. ఇది చూసి లక్ష్మీ(35) దగ్గరికి వెళ్లగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న సీఐ లింగేశ్వర రావు, ఎస్సై గంగరాజు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మహారాష్ట్ర గవర్నర్కు చేదు అనుభవం