Two died in Gaddenna project: సరదాగా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లిన ఇద్దరు మిత్రులు మృత్యుఒడికి చేరారు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోవడంతో ప్రాజెక్టులో సోహైల్(21), ఫిరోజ్(21) మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద జరిగింది.
ఆరుగురు కలిసి సరదాగా..
భైంసాలోని కుంట ఏరియా ప్రాంతానికి చెందిన ఆరుగురు మిత్రులు గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ప్రాజెక్టు వద్ద తిరుగుతుండగా చేపలు పడుతున్న జాలర్ల వద్దకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సయ్యద్ సోహైల్ అనే యువకుడు బండ రాయిపై పెట్టిన కాలు జారిపోవడంతో ప్రాజెక్టు నీటిలో పడి మునిగిపోయాడు. దీంతో అతని వెనుకే ఉన్న సయ్యద్ ఫిరోజ్ మిత్రుడిని రక్షించేందుకు ప్రయత్నించాడు.
ఒకరిని రక్షించబోయి మరొకరు..
ఈ క్రమంలోనే ఫిరోజ్ కూడా అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. ఇద్దరు మిత్రులు కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే మిగిలిన నలుగురు కాపాడేందుకు విఫలయత్నం చేశారు. రక్షించండి అంటూ వారు కేకలు వేయగా.. స్థానిక జాలర్లు, ఇతరులు వచ్చి యువకులను రక్షించేందుకు యత్నించారు. ఇద్దరిని బయటకు తీసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భైంసా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.