విహారయాత్ర రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. జలపాతం అందాలను వీక్షించేందుకు వాహనంలో బయల్దేరగా ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపడడంతో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ అజయ్‌బాబు, ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల్ గ్రామానికి చెందిన ఉట్నూరు మనీష్, ఉట్నూరు రవి(35), పందిరి నిఖిల్‌తో పాటు మొత్తం 12 మంది మిత్రులు కలిసి గ్రామానికి చెందిన అంతడ్పుల బుచ్చిరాజం(45)కు చెందిన టాటా ఏస్ వాహనంలో ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి బయలుదేరారు.
ఖానాపూర్ పట్టణంలోని కుమురం భీం చౌరస్తా దాటి కొంత ముందుకు వెళ్లగానే వారు ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంపై వర్షానికి బాగా తడిసి ఉన్న ఓ భారీ చెట్టు ఆకస్మాత్తుగా కూలింది. దీంతో వాహనం క్యాబిన్ నుజ్జునుజ్జయింది. వాహనాన్ని నడుపుతున్న బుచ్చిరాజం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ముందుభాగంలో కూర్చున్న రవి, నిఖిల్‌లు వాహనంలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు పొక్లెయిన్ సాయంతో చెట్టును పక్కకు తప్పించి వారిని బయటకు తీసి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆలోగా తీవ్ర గాయాలైన రవి మృతిచెందారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వాహనంలో ఉన్న మిగతావారికి ఎలాంటి గాయాలు కాలేదు. బుచ్చిరాజంకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రవికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇవీ చదవండి: