Jubilee Hills Accident Case Update : హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈనెల 17న రాత్రి 8 గంటలకు కారు ప్రమాదం జరిగిందని జూబ్లీహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డు దాటుతున్న వారిని కారు ఢీకొట్టగా.. ప్రమాదంలో 2 నెలల బాబు మృతి చెందాడని, మరో ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశామన్నారు. ఆ కారు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఉందని వివరించారు.
కారు నడిపింది అతనే..
ప్రమాద సమయంలో అప్నాన్, రాహిల్, మహ్మద్ మాజిద్ అనే ముగ్గురు కారులో ఉన్నారని ఏసీపీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ డ్రైవర్ పక్కన ఉన్నారన్నారు. ప్రమాద సమయంలో కారును అప్నాన్ నడిపాడని పోలీసులు వెల్లడించారు. స్టీరింగ్‌పై ఉన్న వేలిముద్రలు, అప్నాన్ వేలిముద్రలు సరిపోయాయన్నారు. కారును ఎవరు నడిపారనే కోణంలో ఇంకా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
దర్యాప్తు కోసం 4 బృందాలు
ఈ ఘటనపై దర్యాప్తు కోసం 4 బృందాలు ఏర్పాటు చేశామని ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. దాదాపు 100 సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించామన్నారు. ప్రమాదం తర్వాత కారులోని ముగ్గురూ పారిపోయారని తెలిపారు. కారు యజమాని సంబంధీకులు బాధితులను అపోలోకు తరలించారని ఏసీపీ చెప్పారు. తర్వాత బిల్లు చెల్లించేవారు లేకపోవడంతో అపోలో నుంచి నిమ్స్‌కు తరలించారన్నారు.
అదుపులో ప్రధాన నిందితుడు..
బాధితులు బాబు మృతదేహం తీసుకుని ఊరికి వెళ్లిపోయారని ఏసీపీ వెల్లడించారు. ప్రమాదం అనంతరం నిందితులు ఎక్కడికి వెళ్లారో తమకు సమాచారం లేదని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు అప్నాన్‌ను అదుపులోకి తీసుకున్నామన్న ఏసీపీ.. మిగతా ఇద్దరిని పంపించేశామన్నారు. కారులోని వ్యక్తులు మద్యం తాగి ఉండకపోవచ్చని చెప్పారు. ఆరుగురి సాక్షుల వాంగ్మూలం తీసుకున్నామని ఏసీపీ స్పష్టం చేశారు. కార్లకు బ్లాక్‌ఫిల్మ్, ఎమ్మెల్యే స్టిక్కర్స్‌పై ప్రత్యేక డ్రైవ్ ఉంటుందన్నారు.
Jubilee Hills Accident Case News : గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి గచ్చిబౌలీలోని ఓ బేకరీరి రాత్రి 7.30లకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ అల్పాహారం తీసుకున్న తర్వాత దుర్గం చెరువు తీగల వంతెన మీదుగా ఫిల్మ్ నగర్ వైపు వెళ్లేందుకు బయల్దేరారు. అతివేగంగా వెళ్తున్న ఆ కారు.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో డివైడర్ దాటేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మహిళలను ఢీ కొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి: