health insurance fraud: కాదేది కవితకు అనర్హం అని ఉన్న సామెతను.. కాదేది మోసగాళ్లకు అనర్హమని మార్చాలేమో..! మోసగాళ్లు దేన్నీ వదలట్లేదు. సామాన్యుల ఏ అవసరాన్ని కూడా విడిచిపెట్టకుండా.. నమ్మించి వంచిస్తున్నారు. అనుకోకుండా వచ్చే అనారోగ్యాల ఖర్చుతో చితికిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా చేసుకునే బీమాను కూడా వాడుకున్నారు. ఆరోగ్య బీమా కల్పిస్తామంటూ నకిలీ కాల్ సెంటర్ ద్వారా జరిగిన ఘరానా మోసం వెలుగు చూసింది. సికింద్రాబాద్ తిరుమలగిరి కేంద్రంగా ఈ మోసం జరిగినట్టు తెలుసుకున్న పోలీసులు.. దీనికి సూత్రదారులైన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
fake call center in thirumalgiri: తమిళనాడుకు చెందిన గోపాలకృష్ణ వెంకటకృష్ణ, నటరాజన్ అర్ముగన్ కలిసి కొద్ది రోజుల కిందట యునైటెడ్ ఇండియా హెల్త్ సంస్థ పేరిట తిరుమలగిరిలో నకిలీ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. కొందరు మహిళలను టెలీకాలర్స్‌గా ఏర్పాటు చేసి మోసాలకు తెర తీశారు. టెలీ కాలర్స్ ద్వారా కొందరికి ఫోన్ చేయించి ఆరోగ్య బీమా కల్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 5 నుంచి పది వేల రూపాయలు చొప్పున వసూలు చేశారు. భారీగా డబ్బులు వసూలు చేసి కాల్‌సెంటర్ మూసేశారు.
fraudsters arrested:తీరా ఆస్పత్రికి వెళ్లాక.. అలాంటి ఆరోగ్య బీమా కంపెనీ లేదంటూ తెలుసుకున్న బాధితులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగాళ్లపై నిఘా పెట్టిన పోలీసులు.. వారిని పట్టుకున్నారు. నిందితులపై తమిళనాడులో కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. దాదాపు 55 మంది వరకు బాధితులు.. 5 లక్షల రూపాయల మేర మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 3 నకీలీ ధ్రువపత్రాలు, మూడు చరవాణులు, మూడు బ్యాంకు చెక్ పుస్తకాలు, రెండు కంప్యూటర్లు, ఓ ప్రింటర్, 18 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: