Constable Courage: మంటల్లో చిక్కుకున్న తల్లి కూతుళ్లను ప్రాణాలకు తెగించి కాపాడి.. ఓ కానిస్టేబుల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే అంతస్తులో ఉన్న మల్లీశ్వరీ, మౌనిక అనే తల్లీకూతుళ్లు.. అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. చాలా మంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను కాపాడాలని అక్కడున్న వాళ్లందరికీ ఉంది.. కానీ.. ఎవ్వరూ అంత సాహసం చేయలేకపోతున్నారు.
ధైర్యంగా మంటల్లోకి దూకి..
అదే సమయంలో విధుల్లో ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్‌కుమార్‌కు ఈ విషయం తెలిసింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న శ్రవణ్‌కుమార్.. మంటలు ఆర్పేందుకు చూశాడు. కానీ.. అలా చేస్తే చాలా సమయం పడుతోందని గ్రహించాడు. ఈలోగా మంటల్లో చిక్కుకున్న తల్లీకూతుళ్లకు ఏదైనా ప్రమాదం జరగొచ్చని ఊహించాడు. ఎలాగైనా వాళ్లను రక్షించాలని తలచాడు. స్థానికులంతా వద్దని హెచ్చరిస్తున్నా.. సాహసం చేశాడు. టెర్రస్ పైకి వెళ్లి మంటలు అలుముకున్న నాలుగో అంతస్తులోకి దూకాడు. మంటల మధ్యన ఉన్న తల్లికూతుళ్లను బయటకు తెచ్చేందుకు.. ధైర్యంగా తాను లోపలికి వెళ్లాడు.
స్థానికుల అభినందనలు..
అందరూ ఏమవుతుందోనని ఆందోళనతో చూస్తుండగా.. ఇద్దరినీ కాపాడి సురక్షితంగా కిందకు తీసుకొచ్చాడు మన కానిస్టేబుల్. ఈ క్రమంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయాస్ఫూర్తితో తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తల్లీకూతుళ్లను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్‌కుమార్‌ను స్థానికులు అభినందించారు.
ఇదీ చూడండి: