డీసీఎం వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అసువులు బాసారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిలపల్లిగేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విశాఖకు చెందిన సత్యవతి(40), డ్రైవర్ శంకర్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి దుర్గా ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా.. కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ప్రమాదం జరిగిందిలా..
కర్ణాటక నుంచి ద్రాక్ష పళ్ల లోడుతో హైదరాబాద్ వస్తున్న డీసీఎం వాహనాన్ని చెట్లపల్లి సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి బిస్కెట్ల లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం వాహనం నుజ్జునుజ్జయింది. ఘటన స్థలంలోనే సత్యవతి, డ్రైవర్ శంకర్ మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు.
హైదరాబాద్ తరలిస్తుండగా మృతి
మరో వ్యక్తి దుర్గా ప్రసాద్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ తరలిస్తుండగానే మార్గమధ్యలో దుర్గాప్రసాద్ మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అతి వేగంగా రావడంతో పాటు ముగ్గురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.