Mahesh Bank Server Hack Case : హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై సైబర్ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుల ఆచూకీ కోసం పోలీస్ ఉన్నతాధికారులు గాలిస్తున్నారు. మహేశ్ బ్యాంక్ సర్వర్‌లోకి ప్రవేశించి రూ.12.90 కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్లు ఆ నగదును దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని బ్యాంకులకు చెందిన 128 ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులకు నైజీరియన్లకు బ్యాంక్ ఖాతాలిచ్చిన పాత్రధారులు మాత్రమే దొరుకుతున్నారు. బెంగళూరులో రెండురోజుల క్రితం ఇద్దరు నైజీరియన్లు, ఒక మణిపురి యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా.. దిల్లీలో బుధవారం రాత్రి ముగ్గురు నిందితులు పూజా కపూర్, అనిల్ మాలిక్, సుస్మితలను పట్టుకున్నారు. బ్యాంక్ సర్వర్‌లోకి ప్రవేశించేందుకు నైజీరియన్లు స్పూఫింగ్, ప్రాక్సీ ఐపీలను ఉపయోగించడం, అవి అమెరికా, యూరప్‌లలో ఉన్నట్టు పోలీసులకు కనిపించడంతో ఎక్కడి నుంచి నేరం చేశారన్నది పది రోజులైనా తెలియలేదు.
కమీషన్ ఆశజూపి..
Mahesh Bank Server Hack Case Updates : ప్రైవేటు ఉద్యోగులు.. గృహిణులు.. మహేశ్ బ్యాంక్ నుంచి రూ.12.90 కోట్లు కాజేసిన నైజీరియన్లు వాటిని తీసుకునేందుకు, దిల్లీ, బెంగళూరు, ఈశాన్య రాష్ట్రాల్లో కమీషన్ తీసుకుని బ్యాంక్ ఖాతాలు సమకూర్చుతున్న వారితో మాట్లాడారు. వారిద్వారా 128 మంది ఖాతాదారులను ఎంపిక చేసుకున్నారు. వీరిలో చాలామంది విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు ఉన్నారు. నిందితులు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన వారిచ్చిన సమాచారం మేరకు రూ.లక్షల్లో నగదు బదిలీ చేశారు. నగదు జమైన వెంటనే వారికి 10 నుంచి 30శాతం కమీషన్ ఇచ్చి మిగిలిన సొమ్ము తీసుకున్నారు. బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసిన మణిపురి యువతి షిమ్రాంగ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. నైజీరియన్ జములు ఓ ఫార్మా కాలేజీలో విద్యార్థి. రెండో నైజీరియన్ ఇమ్మానుయేల్ ఇంజినీరింగ్ ఇటీవలే పూర్తి చేశాడు. దిల్లీలో ఉంటున్న పూజా కపూర్ ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, సుస్మిత గృహిణి, అనిల్‌కుమార్ డిగ్రీ పూర్తిచేశాడు. వీరు చెప్పిన సమాచారం ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు చెప్పాకే తెలిసింది..
Mahesh Bank Server Hack Case News : బ్యాంకు ఖాతాదారులకూ నగదు బదిలీ.. పోలీసుల దృష్టి మళ్లించేందుకు నైజీరియన్లు మహేశ్‌బ్యాంక్ ఖాతాదారుల్లో కొందరి పొదుపు, కరెంట్ ఖాతాల్లోకి రూ.లక్షల్లో నగదు బదిలీ చేశారు. కూకట్‌పల్లిలో ఓ యువకుడి ఖాతాలో రూ.9 లక్షలు బదిలీ చేయగా.. అతను రూ.5లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా.. పొరపాటున వచ్చాయనుకుని తీసుకున్నానని చెప్పి రూ.5లక్షలు వెనక్కి ఇచ్చాడు. బషీర్‌బాగ్‌లోని కరెంట్ ఖాతా ఉన్న ఓ వ్యాపారి ఖాతాలో రూ.50 లక్షలు జమచేయగా ఆయన నగదు విత్‌డ్రా చేసుకోలేదు. పోలీసులు చెప్పాకే నగదు ఉందని అతడికి తెలిసింది.