పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మానేరువాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. సుల్తానాబాద్ మండలం అయితేరాజుపల్లికి చెందిన జోగుల రాజయ్య అనే వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు ఈరోజు నీరుకుల్లాలోని మానేరు వాగులో స్నానం చేసేందుకు వచ్చారు. మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు స్నానానికి రాగా ప్రమాదవశాత్తు తొమ్మిదేళ్ల జోగుల ఆశిష్ నీట మునగగా అతడిని కాపాడేందుకు వెళ్లిన తన సోదరుడు జోగుల మనోజ్‌తో పాటు వేములవాడకు చెందిన తన బంధువు పెంట రాహుల్ కూడా నీట మునిగారు.
అప్పటికే స్నానం చేస్తున్న మిగతా ఐదుగురిని స్థానికులు కాపాడారు. నీట మునిగి పోయిన ఆశిష్, మనోజ్, రాహుల్ను ఈతగాళ్లు గాలింపు చేపట్టి స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి బంధువులు బోరున విలపించారు. మృతుల్లో పెంట రాహుల్ వేములవాడకు చెందిన రాజయ్య మనవడు. వాగులో స్నానాలు చేయవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా స్నానాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: రెండు రోజుల్లో పెళ్లి- కరోనాతో నర్సు మృతి