జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై మంచి నీళ్ల బావి సమీపంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొని అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.
ఓవర్టేక్ చేయబోయి
ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రధాన రహదారిపై బయలుదేరారు. ఆ సమయంలో ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయాలనుకున్నారు. ఆ కారును అధిగమించబోయే క్రమంలో యువకులు.. ముందు వస్తున్న లారీని గమనించలేదు. దీంతో అతివేగంతో ప్రయాణిస్తున్న ఆ బైక్.. లారీని ఢీ కొట్టింది. ఆ ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
విషాదఛాయలు
అతివేగం అదుపు చేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. మృతులు మేడిపల్లికి చెందిన ఆరుముళ్ల శ్రీకాంత్, ఆరుముళ్ల పవన్, ఆయిలవేణి నవీన్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల మృతితో మేడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: Revanth Reddy: 'కరోనాను ఎదుర్కోడానికి వ్యాక్సిన్... కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు'