కొవిడ్ బాధితులకు అవరసమైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్ఓటీ, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు డోస్‌లతో పాటుగా, మూడు చరవాణులు, 6 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని ఓ ఔషధ దుకాణంలో ఈ దందా జరుగుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన రామ్‌చందర్ లాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. అతని అనుచరులు ఫిర్జాదిగూడకు చెందిన కార్తిక్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీనయ్య కలిసి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లను ఒక్క డోసు 35 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా ఇంజక్షన్‌ల దందా గురించి బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: కరోనా కాటుకు భార్యాభర్తలు మృతి