Tension at Khammam Government Hospital : ముక్కు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన వెంకటలక్ష్మి అనే ఓ వివాహిత శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో మృతి చెందిన ఘటన మంగళవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే యువతి మరణించిందంటూ ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడేందుకు వచ్చిన సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఆగ్రహించిన నిరసనకారులు దాడి చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
మంగళవారం నుంచి ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆగ్రహించిన కొందరు బంధువులు ఐసీయూ వద్ద అద్దాలు ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. సూపరింటెండెంట్ తీరుపై వెంకటలక్ష్మి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.
అసలేం జరిగిందటే..: ఖమ్మంలోని పుట్టకోటకు చెందిన సత్తి వెంకటలక్ష్మి(26) ముక్కులో నొప్పి వస్తోందని ఈ నెల 6న జిల్లా ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగంలో వైద్యుడిని సంప్రదించారు. పరీక్షల అనంతరం డీఎన్‌ఎస్(డీవియేటెడ్ నాజల్ సెప్టమ్) సమస్య ఉందని తేల్చారు. ఆమెకు ఆసుపత్రిలో మంగళవారం శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయాసం వచ్చి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఇవీ చదవండి: