Child dies in wall collapse: ఓ భవన నిర్మాణదారుడి, యాజమాని నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఓ చిన్నారిని బలితీసుకున్న ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిర్మాణం చేస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఇంట్లో అంతులేని విషాదం నింపింది. గుంటూరుకు చెందిన సునీల్ హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని శాతవాహన నగర్‌లో కుటుంబంతో కలిసి ఉంటూ స్థానికంగా బేకరి నడిపిస్తున్నాడు.
ఇవాళ ఉదయం బేకరీకి వెళ్లిన సునీల్‌కు... టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు అతని భార్య మేరీ, నాలుగేళ్ల కూతురితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ పక్కనే భవనంపై నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడ కూలి... ఆ ఇటుకలు రోడ్డుపై వెళ్తున్న వారిపై పడ్డాయి. చిన్నారి దీత్య తలపై పెద్ద ఇటుక పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆడుతూ పాడుతూ తిరిగే ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారింది.
నాలుగేళ్ల పాప కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరు అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఇటుకలు మీద పడి మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.
ఇదీ చదవండి:అమానవీయ ఘటన... చెత్తకుండీలో పసికందు