అద్దెకు ఉంటున్న వ్యక్తి ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో జరిగింది. హస్మత్ పేటలోని సత్యసాయి ఎంక్లేవ్‌లో నివాసముంటున్న సురేశ్ దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భార్యాభర్తల గొడవను ఆపేందుకు ఇంటి యజమాని మంగతాయారు(72) వెళ్లింది. మా మధ్య గొడవతో నీకేంటి సంబంధం అంటూ కోపగించుకున్న సురేశ్ ... వృద్ధురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బాత్రూంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
మంగతాయారు కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులను సంప్రదించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా వృద్ధురాలు చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుల్లో ఒకరు దిల్లీలో మరొకరు స్థానికంగా ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సురేశ్ గత కొన్ని రోజులుగా చెడువ్యసనాలకు బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడని పోలీసులు పేర్కొన్నారు. గొడవ జరుగుతున్న క్రమంలో ఆపేందుకు వెళ్లగా మంగతాయారును సురేశ్ హత్య చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు .
ఇదీ చదవండి: అద్దె ఇంట్లో కత్తితో యువకుడి హల్చల్