ఓ వ్యక్తితో ముందస్తుగా ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని అతడికి నకిలీ వజ్రాన్ని కుదువ పెట్టి రూ.58.60 లక్షలు అప్పు తీసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాణిపాకం గ్రామానికి చెందిన డి. భాస్కరరావుకు బంగారుపాళ్యం మండలం నల్లంగాడుకు చెందిన దామోదరం, తవణంపల్లె మండలం సరకల్లుకు చెందిన బొజ్జయ్యతో పరిచయం ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని దామోదరం, బొజ్జయ్య.. చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన శ్రీనివాసులతో కలిసి ఓ నకిలీ వజ్రాన్ని భాస్కరరావు వద్ద కుదువ పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలుమార్లు మొత్తం రూ.58.60 లక్షలు అప్పు తీసుకున్నారు.
అప్పుగా ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలని భాస్కరరావు ఆ ముగ్గురిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వజ్రాన్ని తీసుకోవటానికి దామోదరం, బొజ్జయ్య ముందుకు రాకపోవటంతో అనుమానం వచ్చిన భాస్కరరావు వజ్రాన్ని పరీక్ష చేయించడంతో నకిలీ అని తేలింది. వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. ఆదివారం కాణిపాకం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శ్రీనివాసులు దగ్గర కమీషన్ తీసుకొని భాస్కరరావుకు నకిలీ వజ్రం అంటగట్టినట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: యజమాని తాళం మర్చిపోయాడు.. పనిమనిషి 24 లక్షలు నొక్కేసింది.!