రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎన్‌ఎఫ్‌సీ కాలనీలో ఆరేళ్ల బాలుడి అదృశ్య ఘటన(Tragedy in Rajendra nagar) విషాదాంతమైంది. ఆడుకుంటానని చెప్పి గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చిన్నారి... కుంటలో విగతజీవిగా(missing boy found dead) తేలాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఏం జరిగింది?
కొండారెడ్డి అపార్ట్మెంట్లో నివసించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివశంకర్ కుమారుడు ఆరేళ్ల అనీష్. ఆడుకుంటానని తల్లితో చెప్పి... గురువారం మధ్యాహ్నం పైఅంతస్తు నుంచి కిందకు వచ్చినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతసేపటికీ చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు... చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు... బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు. శుక్రవారం ఉదయం కొండారెడ్డి అపార్ట్‌మెంట్ వెనుక వైపు ఉన్న ఓ కుంటలో బాలుడు శవమై(missing boy found dead) తేలాడు. చిన్నారిని ఎవరైనా అపహరించి హత్య చేశారా? లేక కుంటలో పడేశారా? అని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాబు నిన్న మధ్యాహ్నం 1.30కి మిస్ అయ్యాడు. మిస్ అయినప్పటి నుంచి పోలీసు బృందాలు వెతకడం ప్రారంభించాయి. నిన్న ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం ఇక్కడే వెనక ఉన్న చిన్న కుంటలో మృతదేహం దొరికింది. ఈత కోసం వెళ్లి... ఈతరాక చినిపోయినట్లు కనిపిస్తోంది.
-గంగాధర్, రాజేంద్రనగర్ ఏసీపీ
ఈత కోసం బాలుడే కుంటలోకి దిగి... మృతి చెంది ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఈత కోసమే ముందుగా బట్టలు విప్పి నీటిలో దిగి ఉంటాడని అంటున్నారు. బాలుడి మృతదేహంపై బట్టలు లేకపోవడం, బట్టలు కుంట ఒడ్డున ఉండడంపై సందేహాలున్నాయని బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏం తెలియదు. మేమంతా వెతికినం. రాత్రి నుంచి మొత్తం వెతికాం. అటుమొత్తం చూశాం కానీ ఇటువైపు రాలేదు. బాబు బట్టలు బయట విప్పి ఉన్నాయి. తడిగా ఉన్నాయి. టీషర్ట్ లేదు. మరి ఎలా ఉన్నాయి? రాత్రి అంతా ఎక్కడో పెట్టి... ఎప్పుడో తీసుకొచ్చినట్లున్నారు. అందులో కెమెరాలు ఎందుకు లేవు? ఎవరు అడగడం లేదు... ఎవరూ పట్టించుకోవడం లేదు. వారిని నిలదీసి అడగాలి.
-శోభారాణి, అనీష్ అమ్మమ్మ
కుంట నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు శవపరీక్ష కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారిని... విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతితో స్థానికంగా విషాదషాయలు అలుముకున్నాయి.
అక్టోబర్ 14 నాడు కెమెరాలు పనిచేశాయి. ఆ తర్వాత కెమెరాలు ఏమీ వర్క్ చేయలేదు. వాళ్లని అడిగితే గేటు క్లోజ్ చేస్తున్నారు. మమ్మల్ని ఎవరినీ రానీయడం లేదు. ఏం రెస్పాన్స్ లేదు. మా మీదకే ఫైట్ చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? 24 గంటల తర్వాత చెక్ చేసుకోండి అని అంటున్నారు. 15 ఫీట్ల గోడ ఉంది. బాబు అక్కడి నుంచి జంప్ చేయలేడు. వేరే వైపు నుంచి వచ్చే ఛాన్సే లేదు. బాబు ఒంటరిగా ఇక్కడికి రాలేడు. ఎవరైనా తీసుకొచ్చి ఉంటారు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి.
-ప్రవీణ్‌కుమార్, అనీష్ మామ