Wrong route accidents in Hyderabad: ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కోకాపేటకు చెందిన దంపతులు దుర్గం రాజు, మౌనిక.. షార్ట్ కట్ అనుకుని ద్వి చక్ర వాహనంపై గండిపేట దారిలో రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీ కొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కారు డ్రైవర్ మద్యం సేవించి.. డ్రైవింగ్ చేయటమే ఇందుకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వైపు మద్యం తాగి వాహనం నడపడం, మరోవైపు రాంగ్ రూట్లో ప్రయాణం.. ఇద్దరి మృతికి కారణమైంది.
నిబంధనలు మరిచి
Wrong route road accidents in hyderabad: కళ్లెదుటే ఇలా రాంగ్‌రూట్ ప్రయాణాలతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. వాహన డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో.. 20,000 పైగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిలో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 17,000 కేసులు ఉన్నాయి.
సమయం ఆదా చేయాలని
సమీపంలో యూ టర్నింగ్ లేదని, సమయం కలిసి వస్తుందని వాహనదారులు రాంగ్ రూట్ జర్నీ చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఉప్పల్, గచ్చిబౌలి నుంచి ఎంజీబీఎస్, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, షేక్‌పేట్, మెహదీపట్నం, అత్తాపూర్.. ఇలా దాదాపు 30 ఏరియాల్లో రాంగ్ రూట్లో వాహనాలు వెళ్తున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంగ్‌రూట్ ప్రయాణాలు కట్టడి చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరాలంటే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: Hanamkonda Road accident: ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి