Daughter killed mother: ఆమెకు ఒక్కరే సంతానం.. ఆడపిల్ల అని గారాబంగా పెంచుకుంది. పెళ్లి చేసి వేరే ఊరికి పంపడం ఇష్టం లేక.. కూతురు తన కళ్ల ముందే ఉండాలనే ఆశతో అదే ఊరిలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. తర్వాత కుమార్తెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా సాగుతుంది అనే లోపు.. రోడ్డు ప్రమాదంలో అల్లుడు మృతి చెందాడు. దీంతో కూతురిని ఒంటరిగా అత్తారింట్లో వదిలేయలేక తన వద్దే పెట్టుకుంది. కానీ ఈ క్రమంలో ఇద్దరికీ ఏం విభేదాలు తలెత్తాయో ఏమో.. తల్లి ఆస్తి రాసివ్వనన్నందుకు కోపం పెంచుకుని సమయం చూసి ఆమెను హత్య చేసింది కూతురు.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామంలో బాలమ్మకు(60) ఏకైక సంతానం నర్సమ్మ. ఆమెకు ముగ్గురు పిల్లలు. నర్సమ్మ భర్త లచ్చయ్య 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి నర్సమ్మ పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో నర్సమ్మ.. తల్లి పేరున ఉన్న 16 గుంటల పొలం తన పేరున పట్టా చేయాలని బాలమ్మను ఒత్తిడి చేయసాగింది. దీంతో తాను బతికి ఉన్నంత వరకు ఎవరికీ తన పొలం పట్టా చేసేది లేదని స్పష్టం చేసింది.
Mother murder in thogita: ఆస్తి రాసివ్వనన్నందుకు తల్లిపై కోపం పెంచుకున్న నర్సమ్మ.. ఆమెను చంపేయాలని పథకం రచించింది. పథకం ప్రకారం బాలమ్మను నూతనంగా నిర్మాణమవుతున్న ఇంటిపైకి తీసుకెళ్లి మద్యం తాగించి కిందకు తోసేసింది. కింద పడినా బాలమ్మ బతికే ఉండటంతో అక్కడే ఉన్న బండరాయితో తలపై మోది చంపింది. తర్వాత తనకేమీ తెలియనట్లు.. ఇంటి పై నుంచి కిందికి జారి పడిందంటూ అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారమందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. తమదైన శైలిలో విచారణ చేపట్టి 24 గంటల్లో కేసు ఛేదించారు. కన్న కూతురే చంపినట్లు నిర్ధరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Honey Trap: 'వలపు వలతో దోచుకుంటున్నారు.. బాధితులు భయంతో ఆగిపోతున్నారు'