Panchaloha Buddha idol seized: పురాతనమైన గౌతమ బుద్ధుని పంచలోహ విగ్రహం ఇంట్లో ఉంటే కాలం కలిసొస్తుందని నమ్మి చివరకు కటకటాల పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మిట్టపల్లి వేణుగోపాల్ అనే వ్యక్తి గత 5 ఏళ్ల క్రితం... గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 26 కేజీల పురాతన గౌతమ బుద్ధుని పంచాలోహ విగ్రహాన్ని రూ.5 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంట్లోకి విగ్రహం చేరిన మరుసటి రోజు నుంచే తనకు శుభం కలుగుతుందని, ఆర్థిక లాభం జరుగుతుందని అనుకున్నాడు. కానీ ఏళ్లు గడిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో ఆ విగ్రహాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తనకు తెలిసిన వెంకట నరసింహ రావు, పురుషోత్తమ్, నవీన్ బాబు, భాను ప్రకాష్ అనే వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన యూనిస్ అనే వ్యక్తికి చెందిన మరో ముఠా సభ్యులకు కోటి రూపాయలకు విక్రయించి... వచ్చిన లాభాన్ని పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
సూర్యాపేట కొత్త బస్టాండ్లో బేరం...
యూనిస్ ముఠా సభ్యులు విగ్రహాన్ని కోటి రూపాయలకు ఖరీదు చేసుకుని రూ.2 కోట్లకు విక్రయించాలని భావించారు. అమ్మకానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో అయితే రెండు ముఠాలను గుర్తుపడతారని భావించిన సభ్యులు... ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న సూర్యాపేటను ఎంచుకుని బేరం పెట్టారు. ఈ క్రమంలో రెండు ముఠాలు కలిసి సూర్యాపేట కొత్త బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం గురించి మాట్లాడుతుండగా పోలీసులకు సమాచారం చేరింది. వెంటనే స్పందించిన పోలీసులు రెండు ముఠాలకు చెందిన 11మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
26.3 కేజీల విగ్రహం స్వాధీనం...
నిందితుల నుంచి 26.3 కేజీల బరువు ఉన్న పురాతన పంచలోహ విగ్రహం, నోట్లు లెక్కింపు యంత్రం, 11 సెల్ఫోన్లు, ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పంచలోహ విగ్రహం విలువ సుమారు రూ.30 లక్షల ఉంటుందని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సమాచారాన్ని సేకరించిన కానిస్టేబుల్ సోమయ్యను ఎస్పీ అభినందించి రూ.5వేల నగదు బహుమతిని అందించారు.
అరెస్ట్ అయిన రెండు ముఠాల సభ్యులు...
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏపీలోని కృష్ణ జిల్లా నందిగామకు చెందిన మిట్టపల్లి వేణుగోపాల్, రాంపిల్లి పురుషోత్తమ్, పెనుగంచిప్రోలు మండలం తోటచెర్లకు చెందిన కొత్తమాసు వెంకట నరసింహ రావు, దుర్గిమండల కేంద్రానికి చెందిన చిట్టిమల్ల నవీన్ బాబు, కోట చెన్నయ్య, కోట లక్ష్మీ నారాయణ, ఉయ్యపు శ్రావణ్ కుమార్, విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన చొప్పారపు భాను ప్రకాష్, అవనిగడ్డకు చెందిన మహ్మద్ యూనిస్, జానీ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పిల్లలగడ్డ గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా, నల్లబోతుల శ్రీకాంత్ ఉన్నారు.
ఇదీ చదవండి: Cyber Crime Hyderabad: లైక్‌లు కొడితే లాభాలిస్తామని... రూ.31 లక్షలు స్వాహా!!