వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మహిళ తరపు బంధువులు కొట్టడంతో.. ఓ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులు మహిళ ఇంటి ముందు సమాధి చేయాలని ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన ముడావత్ బలవంతు అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన మహిళ బంధువులు.. యువకుడిపై దాడి చేశారు. మనస్తాపం చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు.
మహిళ ఇంటి ముందు సమాధి చేయాలని..
యువకుడి బంధువులు.. మృతదేహాన్ని దాడి చేసిన మహిళ ఇంటి ముందు సమాధి చేయాలని ప్రయత్నించారు. ఆలా ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరగడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.