Student Commits Suicide in RGUKT:నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయంలో మరో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ అనుబంధ గ్రామమైన జలాల్‌మియాపల్లెకు చెందిన పొదిశెట్టి భానుప్రసాద్.... పీయూసీ -2 చదవుతున్నాడు. బీ1 వసతిగృహంలో ఉంటున్న భానుప్రసాద్.... హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో తోటి విద్యార్థులు గమనించగా ఘటన బయటికి వచ్చింది. మృతదేహం నల్లబడి ఉండటాన్ని చూస్తే... విద్యార్థి ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.... మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భానుప్రసాద్ చదువుల్లో ముందుంటాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీలో రెండు నెలల క్రితం ఓ విద్యార్థి ఆత్మహత్య ఉదంతం మరువక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయంగా మారింది.
భానుప్రసాద్ వ్యక్తిగత కారణాలతోనే ప్రాణాలు తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి జలాల్‌మియాపల్లెకు చెందిన భానుప్రసాద్‌కు తల్లి, సోదరి ఉండగా... తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. భాను మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏబీవీపీ నాయకుల ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో ఆత్మహత్య ఘటనపై మృతుడి బాబాయి ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. విద్యార్థి మృతిపై, సూసైడ్ నోట్‌లో రాతపైనా అనుమానాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీని భాజపా నాయకులు ముట్టడించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించట్లేదని నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనికి చొచ్చుకెళ్లడంతో, పోలీసులు ఆందోళనకారులను పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: