Man Complaint to jayashankar bhupalpally SP on SI : రేగొండ పోలీసులు తనను అకారణంగా కొట్టారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా రామన్నగూడెం గ్రామానికి చెందిన శనిగరం శ్రీనివాస్‌ను పోలీసులు ఆపారు. వాహన పత్రాలు, హెల్మెట్, మాస్క్ ధరించలేదని జరిమానా వేశారు. ఆరు నెలల క్రితమే వాహనానికి సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా రాలేదని చెప్పినా వినకుండా చేయిచేసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఈక్రమంలో కాలివేలు, పక్కటెముకలు విరిగినట్లు వాపోయాడు. రేగొండ ఎస్సైపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపారు.
'నేను మోటార్ వైండింగ్ పనులు చేస్తాను.. రేగొండకు పని మీద వచ్చినందున బండి కాగితాలు ఇంట్లోనే ఉన్నాయి. లైసెన్స్ అప్లై చేసుకున్నాను. కానీ ఇంకా రాలేదు. కొత్త బండి అని చెప్పినా వినలేదు. మాస్క్ కూడా పెట్టుకున్నా. ఇష్టానుసారం కొట్టారు. చాలా దురుసుగా ప్రవర్తించారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నారు. నేను ఒక్కడిని పని చేస్తేనే కుటుంబం నడుస్తుంది. నన్ను చితకబాదారు. నా కుటుంబం పరిస్థితి ఎలా ఇప్పుడు?'
-శ్రీనివాస్, బాధితుడు
ఇదీ చదవండి: Karimnagar Car Accident : గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం