మెదక్ జిల్లా రాయిన్పల్లిలో.. దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలపై ఇలాంటి ఘటనలు అమానుషమంటూ.. మండిపడ్డారు. ఆ మేరకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే..
గ్రామానికి చెందిన దళిత యువకుడు, బీసీ కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కులస్థులు.. అబ్బాయి కుటుంబసభ్యులను ఐదు రోజుల క్రితం సాంఘిక బహిష్కరణ చేశారు. అదీకాక రూ. 12లక్షల జరిమానా విధించారు. వారికెవరూ.. కిరాణాలు, నిత్యావసర సరుకులు సైతం ఇవ్వొద్దని తీర్మానించారు. కనీసం టీ ఇచ్చినా రూ. 2వేలు జరిమానా లాంటి కఠిన నిబంధనలను తీసుకొచ్చారు.
దీంతో బాధితులు రాష్ట్ర దళిత సంఘాల నాయకులను ఆశ్రయించారు. ఘటనపై స్పందించిన శంకర్, మురళి, దయాసాగర్లు.. దళిత యువకుడు పోచయ్య కుటుంబానికి విధించిన రూ.12 లక్షల జరిమానాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక బహిష్కరణను తక్షణమే ఎత్తివేయాలన్నారు.
ఆ మేరకు వారు.. బాధితులతో కలిసి మెదక్ రూరల్ సీఐ పాలవెల్లికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ బంధువుల ఆందోళన