Jagtial murders accused Arrest: జగిత్యాలలో తండ్రి, ఇద్దరు కుమారుల హత్యలో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 24 మందిని గుర్తించిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. గ్రామంలో మూఢనమ్మకాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
jagtial murders: జగిత్యాల టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు , అతని ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లు ఈనెల 20న హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు ప్రధాన నిందితులను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆరు బరిసెలు సహా 9 లక్షల 42 వేల నగదులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నాగేశ్వర్‌రావు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వాడని.. దీనికి తోడు గ్రామంలో ఎవరికి అస్వస్థత కలిగినా.. నాగేశ్వరరావు మంత్రాలే కారణమని బలంగా నమ్మారని పోలీసులు చెబుతున్నారు. అతడి కుటుంబంపై కక్షతో.. గత నెలలో సిరిసిల్ల సమీపంలో హత్యకు విఫలయత్నం చేసినట్లు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే కాలనీవాసులంతా కలిసి దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
మంత్రాలు చేస్తున్నాడని తామంతా కలిసే చంపామని కాలనీవాసులు బహిరంగంగా చెప్పడం.. వారిలో మూఢత్వానికి అద్దం పడుతోంది. వారి కుటుంబంలో మిగిలిన వారినీ చంపుతామని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు మూఢ విశ్వాసాలపై అవగాహన కల్పించి చైతన్యపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. నాగేశ్వరరావు చిన్న కుమారులు రాజేశ్, విజయ్ బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు.