మైలార్‌దేవ్‌పల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య.. ప్రతీకారం తీర్చుకోవడానికి చేశారని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసద్ ఖాన్‌ను అతని అల్లుడు యాసిన్‌తో పాటు మరో ఆరుగురు కలిసి హత్య చేశారని ప్రకాశ్ రెడ్డి వివరించారు. అంజాద్ ఖాన్ కుమారుడు యాసిన్‌కు.. అసద్ కుమార్తెను ఇచ్చి 2016లో వివాహం చేశాడు. ఏడాదిలోపే మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత యాసిన్ రెండో వివాహం కూడా చేసుకున్నాడు. కుమార్తె జీవితం నాశనం కావడానికి అంజాద్ కారణమని.. అసద్ ఖాన్ ప్రతీకారం పెంచుకున్నారు. 2018 సెప్టెంబర్‌లో అసద్ సుఫారీ ఇచ్చి.... అంజాద్ ఖాన్‌ను హత్య చేయించాడు.
ఈ కేసులో అసద్ జైలుకు వెళ్లొచ్చాడు. తండ్రిని చంపిన అసద్‌ను హతమార్చాలన్న కక్ష్యతో రగిలిపోయిన యాసిన్... తన స్నేహితులతో కలిసి పథకం వేశాడు. మార్చి 31వ తేదీన హత్య చేయాలనుకున్నప్పటికీ జనసంచారం కారణంగా కుదరలేదు. దీంతో ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం జహనూమా నుంచి వట్టేపల్లి వైపు బుల్లెట్‌పై వెళ్తున్న అసద్‌ను ఎదురుగా ఆటోలో వచ్చిన యాసిన్ ఢీకొట్టాడు. అతని ఆరుగురు స్నేహితులు.. వెంట తెచ్చుకున్న కొడవళ్లతో దాడి చేశారు.
ముఖం ఛిద్రమయ్యే వరకు కొడవళ్లతో నరికారు. మృతి చెండాని నిర్ధరించుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోలో సంగారెడ్డి వైపు పారిపోయినట్లు డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. నిందితుల్లో ఓ బాలనేరస్తుడు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో ఇంటికి నిప్పు- ఆరుగురు సజీవదహనం