Secunderabad Fire Accident Update: సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనలో క్లూస్ టీం ప్రాథమిక నివేదిక సమర్పించింది. విద్యుత్ ద్విచక్ర వాహనానికి ఛార్జింగ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జింగ్ ఫుల్ అయ్యాక పొగ వెలువడినట్లు వెల్లడించారు. వాహనానికి మంటలంటుకొని క్రమంగా మిగతావాటికి వ్యాపించాయని తేల్చారు.
బ్యాటరీలోని లిథియం అయాన్ రసాయనం కారణంగా భారీగా పొగలు వచ్చాయని పేర్కొన్నారు. సెల్లార్‌లోని మెట్ల నుంచి లాడ్జిలోని నాలుగో అంతస్తు వరకు పొగ కమ్ముకున్నట్లు వివరించారు. ఆ పొగను పీల్చుకోవటంతోనే 8 మంది చనిపోయారని... మరికొందరు అపస్మారకస్థితిలో పడిపోయినట్లు గుర్తించారు. మంటలు మాత్రం సెల్లార్ వరకే పరిమితమైనట్లు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో కొనసాగుతోంది. మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. తర్వాతి అంతస్తుల్లోని 25 గదులను అద్దెకు ఇస్తున్నారు. వాహన పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో విద్యుత్ ద్విచక్రవాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 25 మంది 1-2 రోజులు ఉండేందుకు ఈ లాడ్జిలో బస చేశారు. సోమవారం రాత్రి 9.17 గంటలకు సెల్లార్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి.. వాహనాలన్నీ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
ఇవీ చదవండి: