sahithi infra real estate scam: ప్రీలాంచ్ రాయితీ పేరుతో ఎంతో మందిని మోసగించిన సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మందిని మోసగించిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మినారాయణను నగర సీసీఎస్ పోలీసులు ఈ నెల 2న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కస్టడీకు తీసుకుని విచారించారు. మూడ్రోజుల పాటు ఆయన నుంచి పలు అంశాలను రాబట్టిన పోలీసులు కస్టడీ ముగియడంతో సోమవారం జైలుకు తరలించారు. విశ్వసనీయ సమచారం మేరకు విచారణలో వెలుగు చూసిన విషయాలు ఇలా ఉన్నాయి.
సాంకేతిక లోపాలే వారికి వరం: సాహితీ సంస్థలో బాధితుల సొమ్ములో కొంత భాగం మార్కెటింగ్ ఉద్యోగులు చేతివాటం చూపినట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ మార్కెటింగ్ కోసం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. ఉద్యోగులకు నెలవారీ వేతనంతోపాటు స్థాయిని బట్టి 10-20శాతం కమీషన్ ఇచ్చినట్లు సమాచారం. రోజువారీ విక్రయాలు, నగదు జమ తదితర లావాదేవీల కోసం మరా-మి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. సాంకేతిక లోపాలను కొందరు ఉద్యోగులు అవకాశంగా మలచుకున్నారు. ప్లాట్లు సొంతం చేసుకున్న కొనుగోలుదారులకు చెల్లించిన మొత్తానికి రశీదు ఇచ్చారు. చెక్కులు, ఆన్‌లైన్ రూపంలో వచ్చిన వాటిని సంస్థకు చెల్లించారు. నగదు రూపంలో చేతికి అందిన సొమ్మును సొంత ఖాతాలో వేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మాత్రం పూర్తి నగదు సంస్థ ఖాతాల్లోకి చేరుతున్నట్లు ఏమార్చారు. ఉద్యోగులు కాజేసిన సొమ్ము రూ.100 కోట్లు ఉన్నట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసులతో భయపడిన సదరు ఉద్యోగులు రూ.40 కోట్లు ఇస్తామంటూ లక్ష్మీనారాయణతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం రూ.10 కోట్లు ఇచ్చారు. లక్ష్మీనారాయణ అరెస్ట్‌తో వారంతా సెల్‌పోన్లు స్విచ్చాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
అవన్నీ వివాదాస్పద భూములే: నగర శివార్లలో 11 చోట్ల ప్రీలాంచ్ ఆఫర్లు గుప్పించి రూ.కోట్లు వసూలు చేశారు. వీటిలో అమీన్‌పూర్‌లోని స్థలాలు మినహా మిగిలిన 2-3 ప్రాంతాల్లోని భూములు వివాదంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగర శివార్లలో 4 ఎకరాలకు సంబంధించి అసలు యజమాని ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో ప్రాంతంలోని 5 ఎకరాల భూమి కోసం కేవలం అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. దాంతో డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని పలు సెక్షన్లను జతచేర్చారు. ఆర్థిక లావాదేవీలు, వివిధ సంస్థలకు సొమ్ము బదలాయింపు తదితర అంశాలను గుర్తించేందుకు సీసీఎస్ పోలీసులు నలుగురు ఆడిటర్ల సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో చిక్కుముడులతో ఉన్న కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఇవీ చదవండి :