ఏపీలోని చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం గాజులపల్లిలో పోలీసులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఒక వ్యాను, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఉదయం గాజులపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. బంగారుపాళ్యం నుంచి రెండు మోటార్ సైకిళ్లలో నలుగురు వ్యక్తులు అతివేగంగా రావడం వల్ల అనుమానంతో వారిని ఆపి విచారించారు. అంతలోనే ఒక కారు, మరో వ్యాను అటువైపు రావడం గుర్తించారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోగా మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు.
వ్యాను, కారును పరిశీలించగా.. కర్నాటక రాష్ట్రానికి చెందిన 503 కేసుల సిల్వర్ కప్ బ్రాందీ క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఇతర బ్రాండ్లకు చెందిన 105 కేసుల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న హేమంత్ కుమార్, వెంకటేశ్, సురేశ్, మాధవులు, ఫయాజ్, జ్ఞానశేఖర్ ను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, ఎస్ఈబీ ఏఎస్పీ రిషంత్ రెడ్డి వెల్డడించారు.
ఇదీ చదవండి: ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలి: భట్టి విక్రమార్క