Road Accidents in Cyberabad 2021 : ఐటీ కారిడార్‌తో పాటు... భారీ నిర్మాణాలు, ఇతర పరిశ్రమల సమాహారం సైబరాబాద్ కమిషనరేట్. బాహ్య వలయ రహదారితో పాటు... జాతీయ రహదారి విస్తీర్ణం సైతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా ఉంది. ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల కోసం రహదారులపై నిత్యం లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యం సేవించి వాహనాలు నడపడం, మోటారు వాహనాల చట్టాన్ని అతిక్రమించడం వల్ల రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి ప్రమాదాల వల్ల ప్రాణ నష్టంతో పాటు.... ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటి పట్ల సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాల నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఫలితంగా ప్రాణ నష్టం తగ్గుతోంది.
తగ్గుతున్న ప్రమాదాలు
2021లో 712 ప్రమాదాలు చోటు చేసుకోగా 759 మంది చనిపోయారు. గతేడాదితో పోలిస్తే 3శాతం ప్రమాదాలు తగ్గాయి. 2019తో పోలిస్తే 12శాతం ప్రమాదాలు తగ్గాయి. ప్రతి చిన్న ప్రమాదాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ప్రమాదాల విశ్లేషణ కోసం పోలీస్ ఉన్నతాధికారుల మేరకు ప్రమాదాలను నమోదు చేస్తున్నారు. జాతీయ రహదారులపై 232 ప్రమాదాలు జరగగా... 247 మంది చనిపోయారు. గతేడాదితో పోలిస్తే 40 మరణాలు, 35 ప్రమాదాలు తగ్గాయి.
'సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జాతీయ రహదారులపై ప్రత్యేక గస్తీ బృందాలు ఏర్పాటు చేశాం. శంషాబాద్, మేడ్చల్, రాజీవ్ రహదారి, మొయిబాద్, చేవెళ్ల, వికారాబాద్ రోడ్డుపై 24గంటల పాటు గస్తీ బృందాలు పర్యటిస్తున్నాయి. రహదారులపై అపాయకరమైన పార్కింగ్ లేకుండా చూస్తున్నాం.'
-విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
ఏ రోడ్లపై ఎలా..?
బాహ్యవలయ రహదారిపై గతేడాది 26 ప్రమాదాల్లో 39మంది చనిపోగా... ఈ ఏడాది 33 ప్రమాదాల్లో 39మంది మృతి చెందారు. దూర ప్రాంతాల నుంచి నిద్రలేకుండా అలసటతో ప్రయాణం చేస్తూ వాహనాలు ఢీకొంటున్నాయి. జీహెచ్ఎంసీ రహదారులపై 152 ప్రమాదాల్లో 158 మంది చనిపోయారు. గతేడాది ఈ సంఖ్య 161 మందిగా ఉంది. రహదారి ప్రమాదాల్లో చనిపోయిన వాళ్లలో 57శాతం ద్విచక్ర వాహనదారులే ఉన్నారు.
'మొత్తం 712 ప్రమాదాలు చోటు చేసుకొని 759మంది చనిపోగా... అందులో 416 ద్విచక్ర ప్రమాదాలు జరిగాయి. అందులో 435 మంది చనిపోయారు. ద్విచక్రవాహన ప్రమాదాల్లో 435 మంది చనిపోగా వాళ్లలో 356 మంది శిరస్త్రాణం లేదు. తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే చనిపోయారు. అందుకే బైక్‌పై వెనక కూర్చునే వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధన తీసుకొచ్చారు. 195 ప్రమాదాలో 201మంది పాదచారులు చనిపోయారు. రహదారి ప్రమాదాలు ఎక్కువగా మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఎక్కువగా జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అతి ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. వయసు వారీగా చూస్తే 25-35 ఏళ్ల వయసున్న వాళ్లు 224మంది ఉన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 77 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.'
-విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
మద్యం మత్తు.. జీవితాలు చిత్తు
మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. 712 ప్రమాదాల్లో 217 ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల... డ్రైవింగ్ లెసెన్స్ లేని వాళ్లు బండి నడపటం వల్ల 11శాతం ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. 304 పార్ట్ 2 కేసులు 167 నమోదు చేశామని వివరించారు. అందులో 71 మంది డ్రంక్ అండ్ డ్రైవ్... లైసెన్స్ లేని వ్యక్తులు 54 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
'రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘన చేసే వాళ్లకు స్పాట్ చలాన్, ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నాం. 61.4 లక్షల కేసులు నమోదు చేశాం. ఇందులో డ్రంకెన్ డ్రైవ్ 38,081 కేసులు నమోదయ్యాయి. మైనర్ డ్రైవింగ్ 1,339 మంది, లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 13వేల మందిపై జరిమానా విధించాం.'
-విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
వచ్చే ఏడాదిలో మరింత ప్రణాళిక ప్రకారం వ్యవహరించి రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: India Covid cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు